నా మాటల్లో..: ప్రభుత్వ ఆస్పత్రులు ఎప్పటికీ మారవా!

 

Government hospital staff negligence personal opinion in Telugu

నమస్కారమండి అందరికీ!

 గతంలో ‘ఉచిత బస్సు’ విషయంలో నాకు ఎదురైన అనుభవాలను మీతో పంచుకున్నాను కదా. ఈరోజు నా జీవితంలో స్వయంగా చూసిన, నా మనసును తీవ్రంగా కలచివేసిన మరో చేదు అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. వారం రోజుల క్రితం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్ళాడు మా నాన్న. అయితే పని చేసుకుంటున్న సమయంలో మా నాన్న బురద నీటిలో ఎక్కువసేపు ఉండటం వల్ల కుడి చేతి కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ అయింది. పుండు ముదిరిపోయి ఆయన విపరీతమైన నొప్పితో బాధపడుతున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పెద్దవాళ్లకు హాస్పిటల్ ముఖం చూడడమంటే అస్సలు ఇష్టం ఉండదు. "దానంతట అదే తగ్గిపోతుందిలే" అని సర్దిచెప్పుకుంటారు. మా నాన్న ధోరణి కూడా సరిగ్గా అదే. కానీ నొప్పి తీవ్రత చూసి నేను తట్టుకోలేక, బలవంతంగా ఒప్పించి మా గ్రామానికి సమీపంలోని మిడ్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాను.


ఇన్నాళ్లూ విన్న మాటలు.. కళ్లముందు కనిపించిన దృశ్యం!

నిజం చెప్పాలంటే మాకు అందుబాటులోనే ఉన్నప్పటికీ, నేను ఎప్పుడూ ఆ ప్రభుత్వ ఆసుపత్రి వైపు వెళ్లింది లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచీ చాలామంది చెప్పగా విన్న మాటేమిటంటే.. "ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎవరూ సరిగ్గా పట్టించుకోరు, చూసే దిక్కు ఉండదు, వెళ్లినా ప్రయోజనం ఉండదని. అందుకే ఏ చిన్న సమస్య వచ్చినా కాస్త ఖర్చు ఎక్కువైనా ప్రైవేట్ ఆసుపత్రులకే వెళ్లడం అలవాటుగా మారింది. కానీ ఈసారి దగ్గర్లోనే కదా అని నమ్మి మిడ్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అడుగుపెట్టాను. అయితే ఇన్నాళ్లూ ఇతరులు చెబితే విన్న మాటలు, అక్కడ అక్షరాలా నిజమై నా కళ్లముందే కనిపించాయి. అక్కడున్న డాక్టర్ ప్రాథమికంగా పరిశీలించి, "గాయం తీవ్రంగా ఉంది, కాలి ఎముక ఏమైనా విరిగిందేమో.. వెంటనే ఎక్స్‌రే తీయించుకుని రండి" అని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్స్‌రే ఉచితంగానే తీస్తారు కాబట్టి, సరేనని ఎక్స్‌రే విభాగానికి వెళ్లాను.


ఒక ఎక్స్‌రేకు గంట సమయమా? ఎంతటి నిర్లక్ష్యం!

అక్కడికి వెళ్లేసరికి నాకంటే ముందు కేవలం ఐదుగురు పేషెంట్లు మాత్రమే క్యూలో ఉన్నారు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆవేశం వచ్చింది. సాధారణంగా కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే ఒక ఎక్స్‌రే కోసం, అక్కడ పనిచేసే సిబ్బంది ఒక్కో పేషెంట్‌కు దాదాపు గంట సమయం తీసుకుంటున్నాడు. ఆలస్యానికి కారణం ఏదో పెద్ద టెక్నికల్ సమస్య కాదు. పేషెంట్‌ను ఎక్స్‌రే టేబుల్‌పై పడుకోబెట్టేసి, ఆ టెక్నీషియన్ తీరిగ్గా పక్కన ఉన్నవారితో పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. "చేస్తే చేస్తా.. నేను తీసినప్పుడే మీరు తీయించుకోవాలి, లేదంటే పోండి" అన్నట్లుగా అతని తీరు ఉంది. రోగంతో, నొప్పితో మూలుగుతున్న బాధితుల కంటే అతనికి ఆ కాలక్షేపపు ముచ్చట్లే ముఖ్యమైపోయాయి.


బాధ్యతను ప్రశ్నిస్తే దక్కిన సమాధానం ఏంటంటే..

అక్కడున్న వారి బాధను, అతని బాధ్యతారాహిత్యాన్ని చూసి నాలో ఉన్న సహనం నశించింది. "ఏంటయ్యా ఇది? నొప్పితో పేషెంట్లు నరకం చూస్తుంటే వాళ్లను అలాగే ఉంచేసి ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారా? వాళ్లను త్వరగా చూసుకోవడం మీ బాధ్యత కాదా?" అని ఒక జర్నలిస్టుగా నేను అతన్ని నిలదీశాను. నేను జర్నలిస్టునని చెప్పినా కూడా అతనిలో ఏమాత్రం బెరుకు గానీ, పశ్చాత్తాపం గానీ లేదు. పైగా అదే మొండి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు. ఆ క్షణంలో నా మనసులో తీవ్రమైన ఆవేదన మొదలైంది. ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆసుపత్రుల కోసం ఖర్చు చేస్తున్నాయి, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో కూర్చున్న ఇలాంటి కొందరు నిర్లక్ష్యపు ఉద్యోగుల వల్ల సామాన్యుడికి దక్కాల్సిన వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది.


మార్పు ఎప్పుడు? ఎవరితో మొదలవ్వాలి?

ప్రభుత్వ ఆసుపత్రులు ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలా? ఈ వ్యవస్థకు మార్పు రాదా? అనే ప్రశ్న నన్ను ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేలకు వేలు ఫీజులు కట్టలేని పేదవాడు, రైతు చివరి ఆశగా ప్రభుత్వ ఆసుపత్రుల తలుపు తడతాడు. అలాంటి చోట కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తే ఆ సామాన్యుడు ఎక్కడికి వెళ్లాలి? ఈ పరిస్థితి మారాలంటే కేవలం సామాన్యుడు గొంతు ఎత్తితేనే సరిపోదు. ప్రభుత్వాలు, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను సిబ్బందికి గుర్తుచేస్తూ కఠినమైన నిబంధనలు అమలు చేయాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థ గాడినపడుతుంది. అప్పుడే ప్రతి పౌరుడికి గౌరవప్రదమైన ఉచిత వైద్యం అందుతుంది.

                              జర్నలిస్ట్ ఎం.కె

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.